Welcome to Sevanidhi Charitable Trust
సేవా కార్యక్రమాలతో సేవానిధి ఛారిటబుల్ ట్రస్ట్ — అపూర్వమైన సేవా ప్రస్థానం
“మనసులు కలిస్తే సమాజం మారుతుది” అనే నినాదాన్ని కేవలం ఒక వాక్యంగా కాకుండా ఆచరణలో చూపిస్తూ సేవానిధి ఛారిటబుల్ ట్రస్ట్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. సేవే లక్ష్యంగా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో కొత్త వెలుగులు నింపడానికి ఈ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోంది. నిస్సహాయులు, అనాథులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిస్తూ వారి జీవితాల్లో ఆశను చిగురింపజేయడమే మా ప్రధాన లక్ష్యం.
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థిని ఎం. దివ్య భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఆమె రెండవ సంవత్సరం చదువుల కోసం ₹20,000 ఆర్థిక సహాయం అందజేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ట్రాఫిక్ సీఐ వై. రవికుమార్ గారు విచ్చేసి చెక్కును స్వయంగా అందజేశారు.
సీఐ గారు మాట్లాడుతూ, సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, సేవానిధి ట్రస్ట్ చేస్తున్న కృషి అత్యంత ప్రశంసనీయం అని అభినందించారు. ట్రస్ట్ చైర్మన్ ఊరుబండి కీర్తిశ్రీ సీఐ వై. రవికుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ సెక్రటరీ ఊరుబంది త్రివిక్రమ్ రావు సేవానిధి ట్రస్ట్ భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సహాయం అవసరమైనవారు లేదా సేవలో భాగస్వామ్యమవ్వాలనుకునేవారు సంప్రదించవచ్చని అన్నారు.
ట్రెజరర్ మిరియాల స్వామి గారు కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు, సభ్యులు, మరియు దాతలందరికీ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు మరియు ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని హామీ పంచారు. సభ్యులైన నందూరి వెంకటేష్, తోట సాయి చరణ్, పసుపులేటి అజయ్ కుమార్, నున్న విఘ్నేష్, మరియు ఊరుబండి శ్యామ్ కుమార్ చురుగ్గా పాల్గొని సేవలను అభినందించారు.
మీరు కూడా మా సేవా యజ్ఞంలో భాగంగా ఉండాలనుకుంటే సంప్రదించండి: +91 76758 00169
విజయవాడలో సేవా సౌరభం: అనాథ పిల్లల మధ్య జ్ఞాన కార్తీక్ పుట్టినరోజు వేడుకలు
విజయవాడ: సేవా నిధి చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ వూరుబండి త్రివిక్రమ రావు గారి మరియు వారి కుటుంబ సభ్యులు తమ కుమారుడు వూరుబండి జ్ఞాన కార్తీక్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. బుద్ధవరంలో ఉన్న కేర్ అండ్ షేర్ అనాథ ఆశ్రమంను సందర్శించి, అక్కడ ఉన్న చిన్నారులతో కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ వేడుకలో జ్ఞాన కార్తీక్ తో పాటు ఆయన తండ్రి శ్రీ త్రివిక్రమ రావు, తల్లి శ్రీమతి వూరుబండి అనుష, ట్రస్ట్ ఛైర్మన్ వూరుబండి కీర్తి శ్రీ, ట్రస్ట్ కోశాధికారి మిరియాల స్వామి మరియు ట్రస్ట్ సభ్యుడు నందురి వెంకటేష్ పాల్గొన్నారు. వీరితో పాటు కుటుంబ మిత్రులు తోట సాయి చరణ్, నన్న విఘ్నేష్, మమ్ము, మరియు వూరుబండి శ్యామ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.
చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తమ చేతులతో భోజనం వడ్డించారు. ఈ ఆత్మీయ స్పర్శతో పిల్లల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి.
ఈ సందర్భంగా వూరుబండి త్రివిక్రమ రావు మాట్లాడుతూ, “పుట్టినరోజు లాంటి శుభకార్యాలను ఇలాంటి చిన్నారులతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మన ఆనందాన్ని పదిమందితో పంచుకున్నప్పుడే దానికి నిజమైన అర్థం వస్తుంది” అని తెలిపారు.
ఈ సేవా కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. ఇలాంటి మంచి పనులు సమాజంలో ఇతరులకు స్ఫూర్తినిస్తాయని, సేవాభావం పెంపొందించడంలో తోడ్పడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.
వూరుబండి సత్యనారాయణరావు గారి స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమం
తెనాలి రూరల్: మనిషి వెళ్లిపోయినా ఆయన ఆలోచనలు, విలువలు మాత్రం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. అలాంటి ఉదాత్తమైన విలువలను అందించిన వ్యక్తి వూరుబండి సత్యనారాయణరావు గారు. ఆయనలో ఉన్న దాతృత్వం, సేవా భావం నేటికీ ఆయన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తోంది.
ఆయన జ్ఞాపకార్థం, ఆయన మనుమలు వూరుబండి త్రివిక్రమ్ రావు, వూరుబండి శ్యామ్ కుమార్ కలిసి సేవా నిధి చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. “మా తాతయ్య చూపిన మార్గమే మా ప్రేరణ” అని వారు చెబుతున్నారు.
ఈ స్ఫూర్తితోనే శుక్రవారం తెనాలి తాలూకా నందివెలుగు గ్రామంలోని మహర్షి దయానంద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికి సాదరంగా భోజనం పెట్టి, వారితో సమయాన్ని గడిపారు. వృద్ధులు ఆప్యాయంగా ఆశీర్వదించగా, కుటుంబ సభ్యులు కంట తడి పెట్టుకున్నారు.
ట్రస్ట్ ఛైర్మన్ వూరుబండి కీర్తి శ్రీ మాట్లాడుతూ –
“మా తాతయ్య వూరుబండి సత్యనారాయణరావు గారు సేవలో జీవించారు. ఆయన కలలు కనేది ఎప్పుడూ సమాజం గురించే. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, మేము కూడా పేదవారికి, వృద్ధులకు, విద్యార్థులకు తోడుగా నిలవాలని సంకల్పించాం” అన్నారు.
ట్రస్ట్ సెక్రటరీ వూరుబండి త్రివిక్రమ్ రావు మాట్లాడుతూ –
“ఈ అన్నదానం మా తాతయ్యగారి ఆత్మకు నివాళి. భవిష్యత్తులో విద్యార్థులకు స్కాలర్షిప్‌లు, రోగులకు వైద్య సహాయం, వృద్ధాశ్రమాలకు మద్దతు, అనాథలకు భరోసా ఇచ్చే విధంగా సేవా కార్యక్రమాలను విస్తరింపజేస్తాం. ఇదే మా తాతయ్య చూపిన దారి” అని హృదయపూర్వకంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, కుటుంబ సభ్యులు — వూరుబండి రామమోహన రావు, వూరుబండి వెంకటరత్న కుమారి, వూరుబండి తిరుమల రావు, వూరుబండి ప్రభాకర రావు, వూరుబండి అనూష, అచ్చుకోల రాము, మిరియాల స్వామి తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం అనంతరం వృద్ధులు సంతోషంగా ఆశీర్వదించిన ఆ క్షణం, వూరుబండి సత్యనారాయణరావు గారి జీవన తత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆయన చూపిన దారి ఇప్పుడు ఒక తరాన్ని మాత్రమే కాదు, రాబోయే తరాలనూ వెలిగించే దీపంలా నిలవనుంది.


